లోకేష్ ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ త‌ర్వాత మార్పులుంటాయా..?

లోకేష్ ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ త‌ర్వాత మార్పులుంటాయా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఢిల్లీ (Delhi) పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. శ‌నివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ గతంలో రెండు సార్లు నారా లోకేష్‌ను ఢిల్లీలోకి ఆహ్వానించార‌ని, తాజాగా ప్రధానితో లోకేష్ అపాయింట్‌మెంట్ ఖ‌రారైంద‌ని, అందుకే ఢిల్లీకి చిన‌బాబు ప‌య‌న‌మ‌వుతున్నార‌ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చెబుతోంది. రేపు ఉద‌యం హైద‌రాబాద్ నుంచి హ‌స్తిన‌కు చేరుకొని సాయంత్రం ప్ర‌ధాన‌మంత్రితో లోకేష్ భేటీ కానున్న‌ట్లుగా స‌మాచారం. ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో మంత్రి లోకేష్‌ అనంతపురం పర్యటన అర్థాంత‌రంగా ఆపేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ (Hyderabad) కి బయలుదేరారు.

కాగా, ప్రధాని మోడీతో లోకేష్ భేటీ అంశాన్ని తెలుగుదేశం పార్టీ విప‌రీతంగా ప్ర‌చారం చేసుకుంటుంది. దీంతో రాష్ట్రంలో ఈ అంశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌న్నీ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గ‌తంలో నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం (Deputy Chief Minister) ప‌ద‌వి ఇవ్వాల‌న్న వాద‌న‌లు వినిపించ‌గా, ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా (Amit Shah) టీడీపీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన‌ట్లుగా అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. కూట‌మి విజ‌యానికి ప్ర‌ధాన పాత్ర పోషించిన త‌మ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan) తో స‌మానంగా లోకేష్‌కు ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని గ‌తంలో జ‌న‌సేన (Jana Sena) క్యాడ‌ర్ అభ్యంత‌రం తెలిపింది. ఇరు పార్టీల శ్రేణులు సోష‌ల్ మీడియాలో ఈ విష‌యంపై పెద్ద యుద్ధ‌మే చేశారు. ఆ త‌రువాత స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింది.

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మాల్లో, ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌లు అధికారిక కార్య‌క్ర‌మాల్లో మంత్రి లోకేష్ ప్రాధాన్య‌త‌ను పెంచుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల మంత్రి లోకేష్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ (Chief Secretary) స్థాయి అధికారి హాజ‌ర‌వ్వ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది. కార్య‌క‌ర్తల మీటింగుల్లో, పార్టీ పొలిట్ బ్యూరో స‌మావేశాల్లో లోకేష్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న‌ట్లుగా మీడియా కూడా స్ప‌ష్టం చేస్తోంది. ప్ర‌ధానితో భేటీలో లోకేష్ రాజధాని నిర్మాణం, కేంద్ర సహకారం, నిధుల విడుదల వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని ప‌లువురు బ‌య‌ట‌కు చెబుతున్నా.. ప్ర‌ధాన‌మైన కార‌ణం మ‌రొక‌టి ఉంద‌ని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కులే అనుకుంటున్నారు.

అంతేకాక, త్వరలో కడపలో జరగనున్న మహానాడు (Mahanadu) లో టీడీపీకి సంబంధించి మార్పులు, నూతన బాధ్యతల కేటాయింపు వంటి అంశాల మధ్య లోకేష్‌కు అటు పార్టీలు, ఇటు ప్ర‌భుత్వంలో మరింత కీలక భూమిక దక్కనుందన్న చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీతో జరగనున్న ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో, టీడీపీలో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ కేడ‌ర్ ఊహించిందే జ‌రిగితే.. మ‌రి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న‌లు సైతం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment