దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఉగ్రవాదాలు మంగళవారం రక్తపాతం సృష్టించారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన ఈ ప్రాంతానికి వచ్చిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. లష్కరే తోయిబా (LET) ఉగ్రసంస్థకు చెందిన సభ్యులు జరిపిన కాల్పులలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 27 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడినట్లుగా సమాచారం. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడినవారిలో మహిళలు, వృద్ధులు ఉన్నారు. కొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ దాడికి సంబంధించి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ అనే ఉగ్రసంస్థ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ దాడికి పాల్పడింది తామే అని ప్రకటించుకుంది. ఆ పోస్ట్‌లో గాయపడిన ఓ పర్యాటకుడి ఫోటోను కూడా షేర్ చేయడం తీవ్ర కలకలం రేపింది. “సైనిక దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తుపాకులతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి. అందరూ భయంతో పరుగులు తీశారు” అని గాయపడిన టూరిస్టు ఒకరు వివరించారు.
ఉగ్రవాదులు అత్యంత సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారని, టూరిస్టులు తప్పించుకోలేకపోయారని తెలుస్తోంది. క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. కాగా, మృతుల వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. త్వరలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ దాడి భద్రతాపరంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ, ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలు అప్రమత్తమయ్యాయి.








