అన్నమయ్య జిల్లాలో విషద ఘటన చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన అటవీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మల్లేశ్వరాలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు భక్తులు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాల కోనలో గల మల్లేశ్వరాలయానికి సోమవారం రాత్రి భక్తులు తరలి వెళ్తున్నారు. కాలినడకన వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన భక్తులుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తరచూ ఏనుగుల దాడులు వెలుగుచూస్తున్నాయి. గుండాల కోన ఏనుగుల దాడిపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.








