అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న దోపిడీకి, రైతులకు జరుగుతున్న అన్యాయానికి మాత్రమే వ్యతిరేకమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందన్నారు.
20 నిమిషాలు ఇవ్వాల్సింది 5 నిమిషాలే ఇచ్చారు
వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మా పార్టీకి తక్కువ సమయం కేటాయించారు. మా పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం ఎలా చేశారో రాజ్యసభ చైర్మన్‌కి వివరించాం. రాజ్యసభలో మాకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మాకు 20 నిమిషాల సమయం ఇవ్వాలి. కానీ 5 నిమిషాలే సమయం ఇచ్చి మైక్ కట్ చేశారు. వేరే పార్టీలకు, టీడీపీకి ఎక్కువ సమయం ఇచ్చారు. మేము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారు. అడ్డుకోవడం వల్ల మిగిలిపోయిన మా ప్రసంగం రికార్డులలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. ఈ బిల్లుకు మేం వ్యతిరేకం. రాజధాని రైతుల దగ్గర 50 వేల ఎకరాలు తీసుకున్నారు 29వేల మంది రైతులకు న్యాయం చేయాలని అడిగాం. అమరావతి రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగాం.
అమరావతి పేరుతో దోపిడీ
అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోంది. స్క్వేర్ ఫీట్‌కు 14 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదు. ఇదంతా ప్రజా ధనాన్ని లూటీ చేయడమే. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు? మాకు కేటాయించిన సమయంపై రాజ్యసభ చైర్మన్‌కి వివరించాం. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో టీడీపీ నేతలని టీవీలో చూపించారు. గ్యాలరీలో ఉన్న వారి ఫోటోలను పత్రికలలో వేశారు. దీనిపై విచారణ జరగాలి’ అని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.








