తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం (Prasadam)పై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల టీటీడీ (TTD) మాజీ ఛైర్మన్, వైసీపీ (YSRCP) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. లడ్డూలో కల్తీ ఉందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేస్తూ, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రచారాలను వెంటనే ఆపాలని ఆయన హెచ్చరించారు. లడ్డూ పవిత్రత, తిరుమల పరిరక్షణ రాజకీయాల పరిధిలోకి రానివ్వకూడదని అన్నారు.
సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. “SIT విచారణకు మేము పూర్తిగా సహకరిస్తాం. అవసరమైతే ఎప్పుడైనా హాజరుకి సిద్ధమే. ల్యాబ్ రిపోర్టులు రాకముందే మీడియా లీకులు, రాజకీయ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట వెజిటబుల్ ఫ్యాట్, ఆపై జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలను ప్రశ్నిస్తూ“ల్యాబ్ నివేదికలు లేకుండానే ఎలా ఇలాంటి నిర్ణయాలు చెబుతున్నారు?” అని వివరణ కోరారు.
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై కూడా ఆయన సూటిగా విమర్శలు చేశారు. లడ్డూలో జంతు కొవ్వు వాడారంటూ మొదటగా నిరాధార ఆరోపణలు చేసిన వాళ్లే ఇప్పుడు మరల అదే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. “మా హయాంలో రూ.326కు నెయ్యి కొనుగోలు చేశాం. అందులో కల్తీ ఉందనుకుంటే, చంద్రబాబు హయాంలో రూ.274 నుండి రూ.279 వరకు కొనుగోలు చేసిన నెయ్యి గురించి ఏమంటారు? మరి అందులో కూడా కల్తీ జరిగినట్లు అంగీకరిస్తారా? ధర ఆధారంగా కల్తీ ఆరోపణలు చేయడం సబబు కాదు” అని విన్నవించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల పవిత్రతను ఉపయోగించవద్దని మీడియా సంస్థలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.








