మొన్న ఉల్లి.. నిన్న మామిడి.. నేడు అర‌టి – రైతు రోదన!

మొన్న ఉల్లి.. నిన్న మామిడి.. నేడు అర‌టి - రైతు రోదన!

ఇటీవ‌ల ఉల్లి (Onion), మామిడి (Mango) రైతులకు ప‌ట్టిన దుస్థితే.. నేడు అర‌టి రైతుల‌నూ వేధిస్తోంది. పండించిన ఉల్లి, మామిడి పంట‌ల‌ను రైతులు రోడ్డు మీద ప‌డ‌బోసుకున్న ఘ‌ట‌న‌లు చూశాం. తాజాగా అర‌టి రైతులు కూడా గిట్టుబాటు ధ‌ర (Remunerative Price) లేక అర‌టి గెల‌ల‌ను పొలాల్లో పార‌బోసుకోవాల్సిన ద‌య‌నీయ ప‌రిస్థితి దాపురించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా మిగల్చలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నామని కర్షకులు వాపోతున్నారు. మొన్న ఉల్లి, నిన్న మామిడి, నేడు అరటి పంటకు ఎందుకీ దారుణ పరిస్థితి అని రైతులు కన్నీరు పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అరటి (Banana) రైతుల ఇబ్బందులపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief Y. S. Sharmila Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. అరటికి కిలో ధర రూ.1 నిర్ధారించిన కూటమి ప్రభుత్వం (Coalition Government) రైతులపై ద్రోహం చేసిందని ఆమె ఆరోపించారు. సిరులు కురిపించే అరటి పంట నేడు రైతన్న కంట కన్నీరు తెప్పించే పరిస్థితి వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. టన్నుకు రూ.28 వేల వరకు ఉన్న ధర ఒక్కసారిగా వెయ్యి రూపాయలకు పడిపోవడం వల్ల రైతులు తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ఇలా అన్నదాత ఆరాటపడుతుంటే కూటమి ప్రభుత్వానికి మాత్రం రైతు సమస్యలు పట్టకపోవడం సిగ్గుచేటన్నారు.

ఉద్యానవన శాఖ అలసత్వంగా వ్యవహరిస్తోందని షర్మిలా తీవ్ర విమర్శలు చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన అరటి గెలలను పశువుల మేతగా పడేసే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో రైతు సంక్షేమం ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి చివరకు వేలల్లో కూడా ఆదాయం రాకపోతే రైతు సుభిక్షం ఎలా సాధ్యం అవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) తక్షణమే జోక్యం చేసుకొని అరటి రైతుల సమస్యలు విని పరిష్కార చర్యలు ప్రారంభించాలని షర్మిలా కోరారు. ధరల పతనం కారణాలను సమగ్రంగా సమీక్షించడమే కాకుండా గల్ఫ్, యూరప్ దేశాలకు ఎగుమతులు ఎందుకు తగ్గాయో పరిశీలించాలని సూచించారు. రైతులకు టన్నుకు కనీసం రూ.25,000 గిట్టుబాటు ధర వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment