కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని, అంబేద్కర్‌ను అవమానించిన వ్యక్తికి ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అమిత్ షా జాతీయ నాయకుడిగా గౌరవంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అనేది దేశ ద్రోహంతో సమానమని పేర్కొన్నారామె. అమిత్ షా రాకను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులంతా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు జరపాలని పిలుపునిచ్చారు.
అమిత్ షా క్షమాపణలు చెప్పాలి
అంబేద్కర్‌ను అవమానించేలా మాట్లాడిన అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే అతని మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని షర్మిల పేర్కొన్నారు.