టీడీపీ అల్లరి మూకల దాడుల్లో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిన్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జంగిల్ రాజ్ నడుస్తోందని, ఈ అరాచకాలకు కూటమి నేతలే బాధ్యులని ఆరోపించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అబద్ధాల ప్రచారాన్ని ఆపలేదని జగన్ మండిపడ్డారు. తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పాల్సిన వారు, మళ్లీ అబద్ధాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇది గోబెల్స్ ప్రచారానికి నిదర్శనమని ఆయన అన్నారు.
అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన విధ్వంసం పోలీసుల సమక్షంలోనే జరిగిందని జగన్ ఆరోపించారు. గంటల తరబడి ఇల్లు, ఆఫీసును ధ్వంసం చేయడం, కార్లను కాల్చివేయడం జరిగినా పోలీసులు మౌనంగా ఉన్నారని తెలిపారు. ఇదే తరహాలో జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు, విడదల రజినిపై దాడి యత్నాలు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఘటనలు కూడా పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు.
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా కఠిన కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పాలన ప్రజలకు భయానక వాతావరణాన్ని సృష్టించిందని తెలిపారు.
రాబోయే మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు చేసిన ప్రతి అన్యాయం, అక్రమంపై విచారణలు జరిపి బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, కొంతమంది పోలీసు అధికారులకు స్పష్టంగా చెబుతున్నానంటూ, వడ్డీతో సహా ప్రతి ఒక్కరికీ తిరిగి చెల్లిస్తామని జగన్ గట్టి హెచ్చరిక చేశారు.








