రాష్ట్ర రాజకీయాలు, రైతులు పడుతున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న అవస్థలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయడం, వైద్యరంగం దుస్థితి, అలాగే సూపర్ సిక్స్ హామీల పేరుతో జరుగుతున్న మోసాలను గురించి సుదీర్ఘంగా వివరించారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సినిమాపై కూడా సెటైర్లు పేల్చారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవంలా ఉందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎరువులు, యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ప్రభుత్వం కావాలనే బ్లాక్‌మార్కెట్‌కు ప్రోత్సాహం ఇస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు బారులుతీరుతున్న ఫోటోలను మీడియా ముందు ప్రదర్శిస్తూ, సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గం, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గాల్లో యూరియా కష్టాలు ఫొటోలు చూసి వారిద్దరూ బావిలో దూకాలన్నారు. రైతుల కష్టాలపై ఆర్డీఓ కార్యాలయాలకు అర్జీలు ఇవ్వడాన్ని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని మండిపడ్డారు.
“మా పాలనలో రైతులు ఎప్పుడూ రోడ్డెక్కలేదు. ఎరువులు కొరత రాలేదు. కానీ ఇప్పుడు రైతులు రెండు నెలలుగా యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు. ఇది మీ దారుణ పాలనకు, అవినీతి పాలనకు నిదర్శనం కాదా?” అని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలో యూరియా సరఫరా పెరిగిందన్న వాదనను ఖండిస్తూ, నిజంగా రైతులకు ఎరువులు అందితే వారు రోడ్డెక్కరని, అసలు వాస్తవం ఏమిటంటే యూరియా టీడీపీ నేతల దారిలోకి మళ్లి బ్లాక్‌మార్కెట్‌లో బస్తాకు రూ.200 అదనంగా అమ్మబడుతోందని, రూ.250 కోట్ల స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. అదే సమయంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, వరిలోనూ, చెరుకులోనూ, ఉల్లిలోనూ రైతులు నష్టపోతున్నారని, ఆయన కాలంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు రక్షణ కల్పించామని గుర్తు చేశారు.
వైద్యరంగంపై మాట్లాడుతూ, “మా హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీల పనులు ప్రారంభించాం. 7 కాలేజీలు పూర్తి చేసి, తరగతులు మొదలయ్యాయి. 5 ఏళ్లలో 4,910 సీట్లు పెరిగేలా ప్రణాళిక వేశాం. కానీ చంద్రబాబు ఆ ప్రాజెక్టులపై నీళ్లు పోశాడు. పైగా, పులివెందుల కాలేజీకి కేటాయించిన సీట్లను కూడా వద్దంటూ లేఖ రాశాడు. ఇది రాష్ట్ర ప్రజల పట్ల ఘోరమైన ద్రోహం” అని వ్యాఖ్యానించారు.
ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు, రూ.25 లక్షల వరకు కవరేజీ కల్పించామని, కానీ చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేసి రూ.2.5 లక్షలకే పరిమితం చేశారని, కార్పొరేట్ ఆస్పత్రులు పథకాన్ని తిరస్కరిస్తున్నాయని తెలిపారు. అలాగే సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను జగన్ ఎత్తిచూపారు. మహిళలకు రూ.1500 ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు రూ.3,000 భృతి, పెన్షన్‌ల కోతలు, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం వంటి హామీలు అటకెక్కాయని, ఇవి మోసమే కాదా అని ప్రశ్నించారు.
15 నెలల్లోనే చంద్రబాబు పాలనలో రూ.2 లక్షల కోట్ల అప్పు పెరిగిందని, ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని ఆయన విమర్శించారు. “మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పులో 57.5 శాతం ఈ 15 నెలల్లోనే చేశారు. ఇసుక, మట్టి, మద్యం, అమరావతి భూముల్లో మాఫియా దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గి, వ్యక్తిగత సంపదలు పెరుగుతున్నాయి” అని ఆరోపించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని, తాను కూడా వీటిలో పాల్గొంటానని జగన్ స్పష్టం చేశారు. “ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. ఇవి రాష్ట్ర సంపద. ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ రద్దు చేస్తాం” అని హామీ ఇచ్చారు.