ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాణేనికి రెండో వైపు జరుగుతున్న తతంగాన్ని వివరిస్తానని చెప్పిన జగన్.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయిందని అది కేవలం 3 శాతానికే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై జగన్ మండిపడ్డారు.
గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబును అప్పుల సామ్రాట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు 1,37,546 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడని, అప్పులు తేవడంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 436 గనులను లెక్కగట్టి తాకట్టుపెట్టి బాండ్ల ద్వారా రూ.9 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చాడన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం చట్టరీత్యా నేరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ ఎక్స్‌క్లూజివ్ అథారిటీని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే అని జగన్ చెప్పారు.
ఈ మధ్య కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం రూ.11 వేల కోట్ల స్కామ్ అని జగన్ వెల్లడించారు. యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ కు రూ.4.60 చొప్పున కొనుగోలు చేస్తున్నారని, అంటే.. ఏడాదికి రూ.967 కోట్లు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. వైసీపీ హయాంలో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం రూ.2.49. దీంతో కంపేర్ చేస్తే.. యాక్సిస్ ది రూ.4.60 మైనస్ 2.49 అంటే రూ.2.11 అధికంగా చంద్రబాబు కొనుగోలు చేస్తూ 25 సంవత్సరాల పాటు కొనేట్లుగా అగ్రిమెంట్ వేసుకున్నారన్నారు. అంటే సంవత్సరానికి రూ.440 కోట్ల స్కామ్. 25 సంవత్సరాల్లో రూ.11 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు దోచిపెడుతూ లాలూచీ పడిన పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోందని చెప్పారు.
ఇటీవల ఈనాడు పత్రికలో వార్త చూసి ఆశ్చర్యానికి గురయ్యానని జగన్ చెప్పారు. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని తన ఫొటో ముద్రించారని, సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం.. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని ఈనాడు రాసిందన్నారు. ఆ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ నిజంగా టాయిలెట్ పేపర్ కు ఎక్కువ, టిష్యూ పేపర్ కు తక్కువ అని అనిపించందని వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్య చేశారు. అది పేపరా, పేపర్ పట్టిన పీడనా? అబద్ధాలు రాయడానికి ఏమైనా హద్దూ పద్దూ ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీతో సెకీ ఒప్పందం చేసుకుంది 2021, డిసెంబర్ 1న అయితే.. ఈ సెకీ చైర్మన్ గా రామేశ్వర్‌గుప్తా అనే వ్యక్తి 2023 జూన్ 30న వచ్చారన్నారు. ఒప్పందానికి, అతని తొలగింపునకు అసలు సంబంధమే లేదన్నారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేమన్నట్లుగా ఈనాడు తీరు ఉందని చురకలు అంటించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక చంద్రబాబు.. ఇవి పేపర్లా? మీడియా అని చెప్పుకోవడానికి వీళ్లంతా సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు చూస్తే.. రాష్ట్రంలో విపరీతమైన స్కామ్‌లు జరుగుతున్నాయని, కానీ, ఈనాడులో కనపడదు, ఆంధ్రజ్యోతిలో కనపడవు.. టీవీ5లో అసలు చూపించరన్నారు.