వైసీపీ (YSRCP) విద్యార్థి విభాగం (Student Wing) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థి రాజకీయాల ప్రాముఖ్యత, సామాజిక బాధ్యత, భవిష్యత్తు రాజకీయాల దిశపై జగన్ కీలక సూచనలు చేశారు. “కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గరనుంచే ప్రారంభం కావాలి” అని ఆయన చెప్పారు. విద్యార్థులే భవిష్యత్తు దిక్సూచులు అని పేర్కొంటూ, మంచి రాజకీయాల విత్తనాలు విద్యార్థి దశలోనే నాటాలని పిలుపునిచ్చారు.
తాడేపల్లి (Tadepalli)లోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో జరిగిన స్టూడెంట్ వింగ్ మీటింగ్‌లో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తన ప్రభుత్వ హయాంలో విద్యా రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తు చేశారు. “కేజీ నుంచి పీజీ వరకూ మంచి చదువు అందించడమే మా లక్ష్యం” అని ఆయన చెప్పారు. ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని, ఎడెక్స్‌తో ఉచిత ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. “ప్రపంచంతోనే మన పోటీ ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను జగన్ గుర్తు చేశారు. “విద్యాదీవెన, వసతిదీవెన వంటి పథకాల ద్వారా చదువులకోసం అప్పులు అవసరం లేకుండా చేశాం. రూ.12,609 కోట్లు విద్యాదీవెన కింద, రూ.4,275 కోట్లు వసతిదీవెన కింద ఇచ్చాం. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాలను నిలిపివేయడం దారుణం” అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,200 కోట్లకు చేరాయని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను జగన్ తీవ్రంగా ఖండించారు. “ప్రజల డబ్బుతో నిర్మించిన కాలేజీలను అమ్మేస్తున్నారు. ఇది అత్యంత దరిద్రపు చర్య” అని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించిందని, 2,550 సీట్లు అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. “మీ చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంది” అంటూ విద్యార్థి నాయకులను ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.








