వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల కోసం కీలక హామీ ఇచ్చారు. తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో బుధవారం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తలకు జగన్ కీలక హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా వైఎస్ జగన్ కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటానని, అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని చెప్పారు. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తు పెట్టుకోండి. అన్యాయంగా వ్యవహరించిన వారిని చట్టం ముందు నిలబెడతాం
అని చెప్పారు.
ప్రజల మధ్య నమ్మకం సాధించడమే లక్ష్యం..
నెల్లూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడు చెప్పిన మాటలను ప్రజలు నమ్ముతారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఒక నాయకుడి బాధ్యత అని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజలకు ప్రతీ నెలా కొత్త పథకాలు అందించిందని, ఇది వైసీపీ ప్రభుత్వ ప్రత్యేకత అని అభివర్ణించారు. టీడీపీ ప్రభుత్వంపై ఆరు నెలలకే తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, కూటమి పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని, చిన్న పిల్లాడి నుంచి పండుటాకుల వరకు హామీలిచ్చి మోసం చేశారని జగన్ మండిపడ్డారు.
సోషల్ మీడియాలో గళం బలంగా వినియోగించాలి
సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని జగన్ గుర్తుచేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, అన్యాయాలను ప్రశ్నించడం, కూటమి పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో సోషల్ మీడియా ప్రధాన ఆయుధం అవుతుంది అని తెలిపారు. గ్రామ స్థాయి కమిటీ సభ్యుల నుంచి నాయకుల వరకు అందరూ సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాల పర్యటనలు..
జనవరి చివరి నుండి జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మూడు రోజులు గడుపుతూ, మండల స్థాయి కార్యకర్తలతో సమావేశమవుతానన్నారు. బూత్ కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు బలోపేతం చేయడం ద్వారా పార్టీని మరింత సమర్థంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.