కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పార్టీ నాయకత్వమంతా సమష్టిగా కృషి చేయాలని, సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండ గట్టాలని సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో, అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలపై చర్చించారు.
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీల అమలుపై చేతులెత్తేసి, అందుకే ఏవేవో సాకులు చెబుతున్నాడన్నారు. హామీలను మరుగుపరిచి, ఆ సాకులనే ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని వైఎస్ జగన్ సూచించారు.
సమావేశంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, పేర్ని కిట్టు, కొట్టు సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిగం సురేష్, ఎస్వీ మోహన్‌రెడ్డి, కైలే అనిల్‌కుమార్, కావటి మనోహర్‌నాయుడు, కె.సురేష్‌బాబు, గోరంట్ల మాధవ్, ఈపూరు గణేష్, ఆలూరు సాంబశివారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వంకా రవీంద్రనాథ్, అదీప్‌రాజు తదితరులు పాల్గొన్నారు.