దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూతన కార్యాలయాన్ని పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేస్తూ సంచలన ప్రకటన చేశారు.
విశాఖ నుంచి పోటీ చేయను..
2027లోనే ఎన్నికలు జరుగుతాయని, జమిలి ఎన్నికలకు (వన్ నేషన్ వన్ ఎలక్షన్) వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయని, వైసీపీ మహిళలకి తగిన ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. తనకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచనలేదని, పార్టీ విజయమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభ్యర్థులందరూ కలసి పని చేసి, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపపై పోరాడాలని పార్టీ శ్రేణులను కోరారు.
కూటమి ప్రజలకు మేలు చేయడం లేదు : గుడివాడ అమర్
వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ చేపట్టిన రైతు పోరాటాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు మేలు చేయడం లేదని విమర్శించారు. ఆరు నెలల్లో కూటమి తీసుకొచ్చిన అప్పుల పాలన, ప్రజల అవసరాలను పట్టించుకోని తీరుపై పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
ఈనెల 27న కరెంట్ చార్జీలపై నిరసన : బొత్స
కూటమి పాలనలో కరెంట్ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెరిగాయని మాజీ మంత్రి, శాసనమండలి పక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజా సమస్యలపై నిరసనలు కొనసాగుతాయని, ఈనెల 27న కరెంట్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.