తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు తప్పుడు ప్రచారాన్ని సీబీఐ ఛార్జ్‌షీట్‌తో బద్ధలైంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదానికే అపనింద అంటించారు. జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అంటూ రకరకాలుగా ప్రచారం చేసి తిరుమలేశున్ని రాజకీయాల్లోకి లాగారు. సీబీఐ రిపోర్ట్‌తో అదంతా దుష్ప్రచారమని తేలిపోయింది. కూటమి చేసిన తప్పుడు ప్రచారానికి పరిహారంగా వైసీపీ వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుపతిలో ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’ను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తోంది.
అన్నమయ్య భవనంలో హోమం
తిరుపతిలోని అన్నమయ్య భవనంలో ఈ హోమం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఈ హోమం నిర్వహిస్తున్నారు. భూమన కరుణాకర రెడ్డి దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర స్వామి కృపతో సర్వలోక క్షేమం చేకూరాలని ఈ హోమం ద్వారా ప్రార్థిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు.
రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేక.. : భూమన
ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
“సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్రమైన అపనిందలు మోపారు. ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ విష ప్రచారం చేశారు. దీని వెనుక మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశమే ఉంది” అని ఆయన అన్నారు.
హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిపై రాజకీయ ఆరోపణలు చేయడం అత్యంత దురదృష్టకరమని, కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ నివేదిక వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా ఇంకా అదే విష ప్రచారం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
నిందలకు పరిహారంగా హోమం
“శ్రీవారి ప్రసాదంపై వేసిన నిందలు తొలగిపోవాలనే ఉద్దేశంతోనే శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహిస్తున్నాం. ఈ హోమం ద్వారా వారు చేసిన అపచారం పోతుందని మేం విశ్వసిస్తున్నాం” అని భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి ఆధ్యాత్మిక మార్గంలో పరిహారం కోరుతూ నిర్వహిస్తున్న ఈ హోమం తిరుపతి రాజకీయ వర్గాల్లోనూ, భక్తుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.








