త‌ప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ధ్వ‌జం

త‌ప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? - ఏబీవీ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ధ్వ‌జం

తప్పు చేసి ఏసీబీ విచార‌ణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వర‌రావు, త‌న త‌ప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం ప్ర‌శ్నించారు. వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు తన వ్యాఖ్యలతో కులపరమైన వివాదాలను రెచ్చగొట్టడం సరికాద‌న్నారు. కమ్మ కులం మొత్తం ఒకేతాటిపై నిలబడి జగన్‌ని ఓడించాలని ఏబీవీ పిలుపునిస్తున్నాడ‌ని, మరి కేవలం కమ్మ కులస్థులు ఓటేస్తేనే చంద్రబాబు సీఎం అయ్యాడా?. ఆ విషయాన్ని ఏబీవీ గుర్తుంచుకోవాలని కౌంట‌రిచ్చారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్సీ ర‌ఘురాం మీడియాతో మాట్లాడారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్ జ‌గ‌న్‌పై ఏబీ వెంకటేశ్వరరావు చౌకబారు వ్యాఖ్యలు చేశాడ‌ని, ఏబీవీ చదువుకున్న వ్యక్తిలా, ఉన్నత పోలీస్‌ ఉద్యోగం చేసిన ఐపీఎస్‌ అధికారిలా కాకుండా గేదెలు కాసుకునే వాడిలా కులోన్మాదంతో మాట్లాడారన్నారు. పుచ్ఛలపల్లి సుందరయ్య, కాకాణి వెంటకరత్నం వంటి మహనీయులు పుట్టిన కృష్ణా జిల్లాలో ఏబీవీ లాంటి వ్యక్తి పుట్టడం తాము అవమానంగా భావిస్తున్నామ‌న్నారు.

మూడు ప్రధాన పార్టీలు ఏకమైనా పోటీ చేసినా స‌రే.. జ‌గ‌న్‌కు రాష్ట్రంలోని 40 ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌న్నారు. జ‌గ‌న్ ఒక్క‌డే 40 శాతం ఓట్లు సాధించిన‌ విషయాన్ని ఏబీవీ మర్చిపోయారా..? అని ప్ర‌శ్నించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జ‌గ‌న్‌కు కులాన్ని ఆపాదించలేరని చెప్పారు. వైఎస్ జగన్‌ ఐదేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు.

ఒక కులాన్ని వర్గ శతృవుగా చూడొద్దన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్యలపై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సోషల్‌ మీడియాలో చిన్నచిన్న పోస్టులకే కేసులు పెట్టిన ప్రభుత్వం దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాల‌న్నారు. వైఎస్ జగన్‌పై వ్యాఖ్యలకు ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్‌ చేస్తుంద‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment