అంతర్జాతీయ వార్త ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో గుబులు రేపుతోంది. ఆర్భాటంగా చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్టా, థ్రెడ్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నడుపుతున్న మెటాలో మొదలైన డేటా లీకేజీ కుదుపుతో ఏపీ ఉలిక్కిపడుతోంది. మెటా ఒప్పందంపై మంత్రి లోకేశ్ విసిరిన ఛాలెంజ్ నెలరోజుల్లోనే బెడిసికొట్టింది.
వాట్సప్ గవర్నెన్స్ పేరుతో అరచేతిలోనే పౌరసేవలు అంటూ కూటమి ప్రభుత్వం హడావిడి చేసింది. జనవరి 30వ తేదీన మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి మన మిత్ర అని నామకరణం చేసింది. మెటా గురించి తెలిసిన మేధావుల అభిప్రాయాలతో మొదట్లో ఏపీ వాట్సాప్ గవర్నెన్స్‌కు ఆదరణ కరువవ్వడంతో దీనికి నాయకత్వం వహించిన మంత్రి లోకేశ్ ముందుకు వచ్చారు. మెటా డేటా లీకేజీ జరిగినట్లుగా నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తానంటూ సవాల్ విసిరారు. కానీ, నెలరోజుల్లోనే మంత్రి లోకేశ్ ఛాలెంజ్ బెడిసికొట్టింది. డేటా లీకేజీ కారణంగా తన సంస్థలో పనిచేసే 20 మంది కీలక వ్యక్తులను మెటా ఉద్యోగాల్లోంచి తీసేసింది.
కీలక ఉద్యోగులు తొలగింపు..
మెటాలోని రహస్య సమాచారం లీకైనట్లుగా ఆ సంస్థ ప్రతినిధి ఆర్నాల్డ్ శుక్రవారం ప్రకటించారు. కంపెనీకి చెందిన కీలకమైన సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలతో 20 మందిని సంస్థ తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ లీకేజీ వ్యవహారాన్ని చాలా గోప్యంగా ఉంచాలని ఆ కంపెనీ భావించినప్పటికీ ఉద్యోగుల ఏరివేతతో ఈ తతంగం బయటపడింది. లీకేజీ ఘటనలో మరింత మందిని తొలగించే అవకాశముందని సమాచారం. ఈ ఘటనపై మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల వరుస సమావేశాలు నిర్వహించారు.
ఆధార్ నంబర్‌తో వివరాలన్నీ..
కూటమి ప్రభుత్వం ఇటీవల మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆధార్ నంబర్ వాట్సాప్ చేస్తే చాలు.. ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామని ప్రకటించింది. వాట్సాప్ గవర్నెన్స్‌లో నమోదు చేసే ఆధార్ నంబర్‌తో ఆయా కుటుంబాల వివరాలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు, ఓటరు నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు అన్నీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మెటా (థర్డ్ పార్టీ) సర్వర్‌లో స్టోర్ అవుతాయి. వాట్సాప్ డేటాను మెటా సేకరిస్తోంది. వీటితో పాటు మీరు ఎవరితో, ఎప్పుడు, ఎంతకాలం మాట్లాడారు.. మీ సంభాషణలు ఎంతకాలం సాగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, ఆన్లైన్లో ఎవరితో చాట్ చేస్తున్నారనే డేటా మొత్తం స్టోర్ అవుతుందని నెటిజన్లు వివరిస్తున్నారు.
ఏపీ ప్రజల్లో భయాందోళనలు..
తాజాగా మెటా డేటా లీక్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం నుంచి పొందే వివిధ సేవల కోసం తామిచ్చిన వ్యక్తిగత సమాచారం ఏమైనా లీకైందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల పర్సనల్ డేటాకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన ప్రభుత్వం ఇలా థర్డ్ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వారిలో భయాందోళనలు రేకెత్తించడం కరెక్టేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంటల వ్యవధిలోనే పౌరసేవలు అందించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం టెక్నాలజీ ముసుగులో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రోడ్డునపడేస్తోందని విమర్శలు లేకపోలేదు.
గతంలో మెటా డేటా చోరీకి రూ. 213 కోట్ల జరిమానా
వాట్సాప్ తన మాతృ సంస్థ మెటా (ఫేస్బుక్)కు డేటా షేర్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ జనవరి 4, 2021న డేటా ప్రైవసీ పాలసీకి మార్పులు చేసింది. తద్వారా వాట్సాప్ యూజర్ల సమాచారం వారి ప్రమేయం లేకుండా నేరుగా మెటాకి చేరుతోంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే వాట్సాప్ ను వాడలేకుండా టేకిట్ ఆర్ లీవిట్ పాలసీ తీసుకొచ్చారు. ఈ విధానంపై సీసీఐలో కాంపిటీషన్ యాక్ట్ లో సెక్షన్ 4 కింద కేసులు నమోదయ్యాయి. 2024 నవంబర్ 18న మెటాకు సీసీఐ రూ. 213 కోట్లు పెనాల్టీ విధించింది.