ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో ఒక మైనర్ బాలికపై(Minor Girl) నలుగురు యువకులు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది.
రెండేళ్లుగా నరకం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విస్సాకోడేరు గ్రామానికి చెందిన వెంకట గణేష్(Venkata Ganesh), బడేటి దుర్గ మహేష్(Durga Mahesh), దేవరకొండ భోగేశ్వరరావు, ఆకుల లక్ష్మణ్ అనే నలుగురు యువకులు 2024 సంవత్సరం నుంచి సదరు మైనర్ బాలికను లొంగదీసుకున్నారు. ప్రేమ, మాయమాటలతో నమ్మించి నలుగురూ కలిసి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించడంతో భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించింది.
ఆసుపత్రికి వెళ్తే..
అయితే, ఇటీవల బాలిక ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. బాలిక ప్రస్తుతం ఐదో నెల గర్భిణి అని డాక్టర్లు చెప్పారు.
వైద్యుల మాటలతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తల్లిదండ్రులు, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక బాలికను గట్టిగా నిలదీశారు. దీంతో నలుగురు యువకులు రెండేళ్లుగా తనపై చేస్తున్న అఘాయిత్యాన్ని, పెడుతున్న చిత్రహింసలను బాలిక కన్నీరుమున్నీరవుతూ తల్లిదండ్రులకు వివరించింది.
పోలీసుల రంగప్రవేశం..
జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న బాలిక తల్లి వెంటనే పాలకోడేరు పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టంతో పాటు పలు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులైన వెంకట గణేష్, బడేటి దుర్గ మహేష్, దేవరకొండ భోగేశ్వరరావు, ఆకుల లక్ష్మణ్‌లను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.








