యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత్ తన తొలి మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయం సాధించింది. ఇప్పుడు సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టును వీడి ఇంగ్లండ్‌కు బయలుదేరాడు.
ఆసియా కప్ కోసం రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్న సుందర్, టోర్నమెంట్ మధ్యలోనే జట్టును వదిలి ఇంగ్లండ్‌లోని ప్రసిద్ధ కౌంటీ జట్టు హాంప్‌షైర్‌లో చేరాడు. అక్కడ 2025 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో చివరి రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు.
వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ప్రధాన జట్టులో కాకుండా రిజర్వ్ స్క్వాడ్‌లో చేర్చారు. ప్రధాన జట్టులో ఇప్పటికే ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నందున సుందర్‌కు ఆడే అవకాశం తక్కువ. ఇదే సమయంలో ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ నుంచి సుందర్‌కు ఆఫర్ వచ్చింది. దీనికి సుందర్ వెంటనే అంగీకరించాడు. హాంప్‌షైర్ తరపున మిగిలిన రెండు మ్యాచ్‌లలో అతడు బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని గురువారం హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది.
ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 284 పరుగులు చేసి, ఒక సెంచరీ సాధించాడు. బౌలింగ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే అతడికి కౌంటీలో ఆడే అవకాశం దక్కింది. సుందర్‌కు కౌంటీ క్రికెట్‌లో ఆడటం ఇది రెండోసారి. 2022లో లంకాషైర్ తరపున ఛాంపియన్‌షిప్, వన్డే కప్ ఆడాడు. హాంప్‌షైర్ తన తదుపరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 15-18 వరకు సోమర్‌సెట్‌తో, సెప్టెంబర్ 24-27 వరకు సర్రేతో ఆడనుంది.