ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించిన సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. వాలంటీర్ల రూపంలో చంద్రబాబుకు సవాళ్లు ఎదురవుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కూటమి పార్టీ అభ్యర్థులపై పోటీ చేయడానికి వాలంటీర్లు సిద్ధమయ్యారు. రూ.10 వేల వేతనం అందిస్తానని చెప్పి ఉపాధి లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను విస్మరించారని భావిస్తూ, కూటమి అభ్యర్థులకు పోటీగా బరిలో దిగాలని వారు నిర్ణయించారు. గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాలంటీర్ శివగణేశ్, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వాలంటీర్ లంక గోవిందరాజును పోటీలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
పట్టభద్రుల ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల పైచిలుకు ఓటర్లున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఒక్కోచోట దాదాపు లక్షకు పైగా ఓటర్లను చేర్పించారు. వార్ వన్‌సైడ్ అని ధీమాగా ఉన్న కూటమికి ఎన్నికల బరిలోకి దిగి అనూహ్యంగా వాలంటీర్లు షాక్ ఇచ్చారు. ఓటర్లతో వాలంటీర్లకు సత్సంబంధాలు ఉండటంతో అధికార పార్టీల నేతలు కాస్త జంకుతున్నారు.








