వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాలపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తీసుకుంటోందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే దుకాణాలను కూల్చివేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. జీవీఎంసీ వద్ద హాకర్లతో కలిసి వైసీపీ శ్రేణులు చేపట్టిన భారీ ర్యాలీకి పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ ఆందోళన కొనసాగింది. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన కెకె రాజు, జీవీఎంసీ అధికారులు అధికారిక లైసెన్సులు ఇచ్చిన దుకాణాలను కుట్రపూరితంగా తొలగించారని ఆరోపించారు.
కెకె రాజు మాట్లాడుతూ.. హాకర్లకు గతంలో ట్రేడ్ లైసెన్సులు, విద్యుత్ మీటర్లు ఇచ్చి వ్యాపారం ప్రోత్సహించిన అధికారులు, ఇప్పుడు అదే దుకాణాలను జేసీబీలతో కూల్చివేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. దుకాణాలు కోల్పోయిన వారికి తక్షణం నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే మేయర్, ఎంపీలు, కూటమి ఎమ్మెల్యేలను బహిరంగంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ చర్యల వల్ల విశాఖలో దాదాపు 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ముఖ్యంగా మహిళా హాకర్లు లోన్లు తీసుకుని స్వయం ఉపాధి కొనసాగిస్తున్న పరిస్థితుల్లో వారిని అణగదొక్కడం అమానుషమని వైయస్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు.
విశాఖ అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, అమరావతి కోసం ఉత్తరాంధ్రను పణంగా పెడుతున్నారని కెకె రాజు ఆరోపించారు. ఇక్కడి భూములు, వనరులను అమరావతికి తరలించేందుకు కుట్ర జరుగుతోందని, దీనిపై వైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) September 23, 2025
వైజాగ్ స్ట్రీట్ వెండర్స్‌కు సపోర్ట్‌గా వైసీపీ భారీ ర్యాలీ
ఆపరేషన్ లంగ్స్ కూల్చివేతలతో రోడ్డునపడ్డ చిరు వ్యాపారులు
చిరు వ్యాపారులకు మద్దతుగా @YSRCParty ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ
వైసీపీ నేతల ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ర్యాలీని… pic.twitter.com/I0Ms2vTybl







