విశాఖ గో మాంసం కేసులో బిగ్ ట్విస్ట్

విశాఖ గో మాంసం కేసులో బిగ్ ట్విస్ట్

విశాఖ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన గో మాంసం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు తిరిగింది. భారీగా గో మాంసం పట్టుబడినప్పటికీ, టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గుప్తాను పోలీసులు కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

శొంఠ్యం సమీపంలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్‌లో 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ కేంద్రంగా గో మాంసం అక్రమ నిల్వలు, రవాణా జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.

అయితే, గో మాంసం నిల్వలు పట్టుబడిన గోడౌన్ టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గుప్తాకు సంబంధించినదిగా ఆరోపణలు ఉన్నప్పటికీ, నిందితుల జాబితాలో ఆయన పేరు చేర్చకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోడౌన్ యజమాని అంశాన్ని పక్కనపెట్టి, ఇతరులపై మాత్రమే కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న గో మాంసాన్ని పూడ్చివేశామని, కేసు వివరాలను డీసీపీ అధికారికంగా వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నప్పటికీ, ప్రధాన వ్యక్తుల పేర్లు బయటకు రాకపోవడంపై సందేహాలు పెరుగుతున్నాయి.

గో మాంసం అక్రమ రవాణా ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం కూడా స్పందించి, నిందితులు ఎవ‌రైనా సరే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తప్పవని స్పష్టం చేశారు. అయినా రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలపై స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

భారీ స్థాయిలో గో మాంసం నిల్వలు బయటపడిన ఈ కేసులో నిజమైన సూత్రధారులు ఎవరు? రాజకీయ అండదండలతో తప్పించుకుంటున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment