టీమిండియా (Team India) సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వార్త మరొకటి చక్కర్లు కొడుతోంది. భారత క్రికెట్‌లో ఒక లెజెండ్‌గా ఎదిగిన విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాకు ఎన్నో పరుగులు సాధించాడు. అంతేకాదు, ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. తనదైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం, కోహ్లీ టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పి వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యాడు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ ట్రోఫీ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు కోహ్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (Delhi Premier League )లోనూ ఆడే అవకాశం ఉందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆడతాడా?
ఢిల్లీ క్రికెట్‌కు కోహ్లీ ఎప్పుడూ అండగా ఉన్నాడని, యువ క్రికెటర్లను గైడ్ చేస్తూ ఉన్నాడని రోహన్ జైట్లీ తెలిపారు. ఢిల్లీ క్రికెట్‌కు అవసరం ఉన్నప్పుడు కోహ్లీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని జైట్లీ అన్నారు. కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్ డీపీఎల్‌లో ఆడితే చాలా ఆనందంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అతని స్థాయి, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అతని మార్గదర్శకత్వం యువ ఆటగాళ్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు.
కోహ్లీకి ఢిల్లీ క్రికెట్‌తో తన కెరీర్ ఆరంభం నుంచీ బలమైన బంధం ఉందని, గతంలో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌ల్లో కూడా ఆడాడని ఆయన గుర్తు చేశారు. కాగా, కోహ్లీ చివరగా 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. దీంతో తన లాస్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను కూడా ఇక్కడే ముగించాడు. అయితే, ఈ లీగ్‌లో కోహ్లీ ఆడతాడా లేదా అనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు








