ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. తన తండ్రి తన పాస్‌పోర్ట్‌తో పాటు డబ్బు కూడా తీసుకున్నారని, తన ప్రాణానికి ముప్పు ఉందని ఆరోపిస్తూ కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె, తనకు తక్షణ భద్రత కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఇదే సమయంలో ఆమె భర్త ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. మోనాలిసా మైనర్ అని ఆమె తండ్రి ఫిర్యాదు చేయగా, తాను మేజర్‌నని, తన స్వచ్ఛంద నిర్ణయంతోనే ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నానని మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం.
ఇదివరకే తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ మోనాలిసా కేరళ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆమెకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయితే అనంతరం మోనాలిసా, ఆమె భర్త అందుబాటులో లేకపోవడంతో భద్రతను ఉపసంహరించుకోవాలని హైకోర్టు సూచించింది. అవసరమైతే మళ్లీ సంప్రదించిన తర్వాత రక్షణ కల్పించవచ్చని కూడా స్పష్టం చేసింది. తాజాగా ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. తదుపరి చర్యలపై కొచ్చి నగర పోలీస్ కమిషనర్‌తో సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. కుంభమేళాలో తన ప్రత్యేక రూపంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా, వివాహం అనంతరం కుటుంబ వివాదాలు, న్యాయపరమైన వ్యవహారాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.








