ఇంద్రకీలాద్రి (Indrakeeladri) దుర్గగుడి (Durga Temple) భక్తుల కోసం ఆలయ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ దర్శనాలకు వచ్చే భక్తులు (Devotees) డ్రెస్ కోడ్ (Dress Code)ను తప్పనిసరిగా పాటించాలి. అభ్యంతరకర దుస్తుల్లో వచ్చే భక్తులకు ఎంట్రీ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ నియమాలు ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
భక్తులు మోడ్రన్ డ్రస్సులు ధరించి దర్శనానికి రావడం, అలాగే ఆలయంలో మూలవిరాట్ విగ్రహం వీడియోలు, ఫొటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈవో వి.కె. శీనానాయక్ (V.K.Srinanayak) ప్రకటించారు. అభ్యంతరకర దుస్తుల్లో వచ్చే వారిని క్యూలైన్ ఎంట్రన్స్, టిక్కెట్ కౌంటర్, స్కానింగ్ పాయింట్ వద్దే వెనక్కి పంపించాలనే ఆదేశాలు జారీ చేశారు.
అలాగే ఆలయ ప్రాంగణంలోకి సెల్ఫోన్లు (Mobile Phones) తీసుకురావడంపై కఠిన నిషేధం విధించారు. సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ పాటించి ఐడీ కార్డు ధరించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో మొబైల్ వినియోగం పూర్తిగా నిషేధించబడగా, సూపరింటెండెంట్లు, ఏఈవోలు మాత్రమే ఫోన్ వాడుకోవచ్చని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. భక్తులకు కొత్త నిబంధనలు తెలిసేలా ఆలయ ప్రాంగణంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.