విజయవాడ భవానీపురంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో హైడ్రా తరహాలో 42 నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ తరఫున వచ్చిన కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కోర్టు తీర్పుతో కూల్చివేతలు
లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ భూవివాదంపై కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. తీర్పు వెలువడిన వెంటనే భూభాగంలో ఉన్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడం ప్రారంభించారు. స్థలంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనతో, పోలీసులు భారీగా మోహరించారు. కూల్చివేత ప్రాంతానికి ఎవ్వరు చేరకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కట్టే పనులు కూడా సొసైటీ చేపట్టింది.
రోడ్డునపడ్డ 42 కుటుంబాలు… ఆవేదన
25 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివాసముంటున్నామని, ఒక్కసారిగా బయటకు వెళ్లగొట్టడం అన్యాయం అని బాధితులు విలపించారు. “మన ఇల్లు… మన కష్టం… ఒక్కరోజులో మట్టికరిపించారు” అని పలువురు కన్నీరుమున్నీరయ్యారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు, పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
తాము ఆ స్థలాలను కొనుగోలు చేసినప్పుడు అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని, ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో, వృద్ధులతో కలిసి తమ సొమ్ము సొత్తు వీధిలో పడేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని కుటుంబాలు చెబుతున్నాయి. భవానీపురంలో జరిగిన ఈ కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. భూవివాదాల్లో చిక్కుకు పోయిన అమాయక ప్రజలు కోర్టు ఆదేశాలతో కూల్చివేతలు జరపడంతో నిరాశ్రయులుగా మారారు.








