ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ.. పొత్తుకు వారివైపే మొగ్గు?

ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ.. పొత్తుకు వారివైపే మొగ్గు?

అసెంబ్లీ ఎన్నికల్లో ‘దళపతి’ విజయ్ (Thalapathy Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో, తమిళనాట సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, ఇప్పుడు అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.

విజయ్ విజయం సాధించిన నేపథ్యంలో, చెన్నైలోని(Chennai) పనయూరులో ఉన్న టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద అభిమానుల సందడి ఆకాశాన్ని తాకుతోంది. తమిళనాడు నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో ఆ ప్రాంతమంతా పసుపు-నేపథ్య జెండాలతో నిండిపోయింది.

ఈరోజు ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న విజయ్, కొత్తగా ఎన్నికైన తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. మ్యాజిక్ ఫిగర్ (118)కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనుంది.

అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని టీవీకే ఇప్పటికే గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి రెండు వారాల సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఒకవైపు డీఎంకే (59), అన్నా డీఎంకే (47) వెనుకంజలో ఉన్నప్పటికీ, టీవీకేను అధికారానికి దూరం చేసేందుకు మంతనాలు జరుపుతున్నాయన్న వార్తలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి.

కింగ్ మేకర్లుగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు
తమిళనాడు ఓటరు తీర్పుతో ఇప్పుడు చిన్న పార్టీలే ‘కింగ్ మేకర్లు’గా మారాయి. మొత్తం 108 స్థానాలు ఉన్న టీవీకేకు కాంగ్రెస్ (5), పీఎంకే (4), సిపిఐ- సిపిఎం (4), ఐయూఎంఎల్- వి.సి.కె (4) మద్దతు లభిస్తే సులభంగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటుతుంది.

దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను దాటుకుని, ఒక కొత్త పార్టీ మొదటి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలవడం భారత రాజకీయాల్లోనే అరుదైన విషయం. ఒకవైపు అధికార దాహం ఉన్న పాత పార్టీలు, మరోవైపు మార్పు కోరుకున్న ప్రజలు.. ఈ నేపథ్యంలో విజయ్ తన రాజకీయ చతురతతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరికొద్ది గంటల్లో పనయూరు కార్యాలయం నుంచి వెలువడే ప్రకటన తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment