మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట (Relief) లభించింది. వంశీ బెయిల్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం, సుంకర సీతామహాలక్ష్మి (Sunkara Seethamahalakshmi) దాఖలు చేసిన పిటిషన్ (Petition)ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. గన్నవరంలో 2019-2024 మధ్య జరిగిన అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది (Dismissed).
జస్టిస్ (Justice) ఎం.ఎం. సుందరేష్ (M.M. Sundresh), జస్టిస్ (Justice) వినోద్ చంద్రన్ (Vinod Chandran)లతో కూడిన ధర్మాసనం, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, సుంకర సీతామహాలక్ష్మి దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరిపింది. అయితే, బెయిల్ రద్దుకు సంబంధించి తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు ఆసక్తి చూపలేదు. తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో వంశీ విడుదలకు లైన్ క్లియర్ అయ్యిందని, నాలుగున్నర నెలలు (138 రోజులు) తరువాత బయటకు రానున్నారని ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.
అక్రమ మైనింగ్ కేసు (Illegal Mining Case)లో వంశీపై గన్నవరం పోలీసులు మే 15న కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా మే 30న హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా “తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై సీల్డ్ కవర్‌లో నివేదిక ఇస్తాం” అని తెలిపారు.
అయితే, కోర్టు “ఇప్పటికే వంశీని అనేక కేసుల్లో అరెస్టు చేశారు కదా?” అని ప్రశ్నిస్తూ.. మైనింగ్ వాల్యూయేషన్ నివేదిక సమర్పించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసుతో పాటు, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా వంశీకి జూలై 1న నూజివీడు కోర్టు (Nuzvid Court) బెయిల్ మంజూరు చేసింది. నాలుగున్నర నెలలుగా వల్లభనేని వంశీపై నమోదైన 11 కేసుల్లో బెయిల్ లభించినట్లు సమాచారం. దీంతో వంశీ ఇవాళ సాయంత్రంలోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.