మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత (YSRCP Leader) వల్లభనేనీ వంశీ (Vallabhaneni Vamsi) కి ఎట్టకేలకు బెయిల్ (Bail) మంజూరు అయ్యింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వంశీతో పాటు అరెస్టయిన మరో నలుగురికి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఏ1 వల్లభనేని వంశీ, ఏ4 గంటా వీర్రాజు, ఏ5 రంగా, ఏ8 లక్ష్మీపతి, ఏ10 వేల్పూరు వంశీ ఉన్నారు. కాగా, వీరందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గత ఫిబ్రవరి నెలలో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్, భూకబ్జా వంటి అనేక ఆరోపణలతో వంశీపై అప్పటి నుంచి వరుస కేసులు నమోదువుతుండగా, ఫిబ్రవరి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగానే విజయవాడ (Vijayawada) సబ్ జైలులో ఉంటున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయలతో రెండు షురీటీలు సమర్పించాలని ఆదేశించింది. దీంతో వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనారోగ్యంతో వంశీ..
ఇవాళ కోర్టులో విచారణకు హాజరైన వల్లభనేని వంశీ.. తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు తెలిపారు. తాను మాట్లాడేందుకు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నానని న్యాయస్థానానికి తెలిపారు. దీంతో వంశీని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. వంశీ ఆరోగ్యంపై మెమో దాఖలు చేయాలని వంశీ తరపు న్యాయవాదికి ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వంశీకి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సబ్ జైలుకు తరలించారు.








