చైనా (China)లోని టియాంజిన్ (Tianjin)లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత (India) ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Putin), చైనా (China) అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping)తో మోడీ సమావేశం కావడంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా భారత్‌పై 50% సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ మూడు దేశాలు మరింత దగ్గరవుతున్నాయి. పుతిన్, జిన్‌పింగ్‌లతో మోడీ కరచాలనం, ఆత్మీయ ఆలింగనం అమెరికా (America)కు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో, భారత్ తమ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ట్రంప్ ప్రభుత్వం (Trump Government) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోడీ-పుతిన్ భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా ఒక కీలక ప్రకటన చేసింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) మాట్లాడుతూ, అమెరికా-భారత్ బంధాన్ని “21వ శతాబ్దాన్ని నిర్వచించే సంబంధం”గా అభివర్ణించారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఆయన అన్నారు. రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల వరకు, రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహమే ఈ ప్రయాణానికి ఇంధనమని రూబియో వ్యాఖ్యానించినట్లు అమెరికా రాయబార కార్యాలయం ఉటంకించింది.
అమెరికా సుంకాలను భారత్ ఏ మాత్రం పట్టించుకోకుండా, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు భారత్ సహకరిస్తోందని అమెరికా వాదిస్తున్నప్పటికీ, 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారిస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. దశాబ్దాలుగా రష్యాతో ఉన్న సంబంధాలను అమెరికా బెదిరింపులకు లొంగి పాడు చేసుకోలేమని భారత్ పరోక్షంగా తెలియజేసింది.