టీటీడీ ఈవో మార్పు.. రెండేళ్ల‌లో మూడో అధికారి

టీటీడీ ఈవో మార్పు.. రెండేళ్ల‌లో మూడో అధికారి

తిరుమల కొండ‌పై కొలువైన‌ క‌లియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారికి సేవ చేయడం మహద్భాగ్యం భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా టీటీడీ ఈవోగా సేవ చేసే అవకాశం రావడాన్ని ఐఏఎస్ అధికారులు గౌరవంగా భావిస్తుంటారు. సాధారణంగా ఒకసారి ఈవోగా నియమితులైన అధికారులు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు తిరుపతి–తిరుమలలో విధులు నిర్వహించిన సందర్భాలే ఎక్కువ.

కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. కూటమి ప్రభుత్వం రెండేళ్లు కూడా పూర్తి చేసుకోకుండానే, టీటీడీ ఈవోగా ముచ్చటగా మూడో అధికారిని నియమించడం ప్రస్తుతం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రెండోసారి టీటీడీ ఈవోగా నియ‌మించిన అనిల్ కుమార్ సింఘాల్‌ను స‌డ‌న్‌గా త‌ప్పించింది. దీనికి టీటీడీలో నెయ్యి కల్తీ వ్యవహారంలో ఆరోప‌ణ‌లే కార‌ణ‌మంటూ సాకు చెప్పింది. సింఘాల్‌ను ఈవో పదవి నుంచి బదిలీ చేసింది.

తిరుమల నుంచే సంస్కరణలు ప్రారంభిస్తామని కూట‌మి ప్ర‌భుత్వం శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమించింది. అయితే నెయ్యి కల్తీ ఆరోపణలు, అలాగే పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడితో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో శ్యామలరావును పదవి నుంచి తొలగించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. టీడీపీ అనుకూల మీడియా సింఘాల్‌ను సమర్థవంతమైన అధికారిగా విస్తృతంగా ప్రశంసించినప్పటికీ, సిట్ నివేదిక వెలుగులోకి రావడంతో ఆయన్ను తప్పించక తప్పలేదు.

ప్రస్తుతం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహిత హోదా (సీఎంవో ముఖ్య కార్యదర్శి)లో ఉన్న ముద్దాడ రవిచంద్రను ఈవోగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల నమ్మకం, ప్రభుత్వ విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. తిరుమలలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ భక్తుల విశ్వాసం సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ వ్యవహారాల్లో పారదర్శకత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని ముద్దాడ రవిచంద్ర అన్నారు. రెండేళ్లు కూడా నిండ‌కుండా, టీటీడీలో ముచ్చ‌ట‌గా ముగ్గురు ఐఏఎస్ అధికారులు మార‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment