టీటీడీ ఈవో సింఘాల్ బదిలీ.. ఇంత స‌డ‌న్‌గా ఎందుకు..?

టీటీడీ ఈవో ఆకస్మిక బదిలీ.. లడ్డూ వివాదం డైవర్షన్ కోసమేనా?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రబాబుకు సింఘాల్ స్థానంలో అదనపు బాధ్యతలను అప్పగించారు.

గమనార్హం ఏమిటంటే, అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా రెండుసార్లు నియమించింది స్వయంగా సీఎం చంద్రబాబే. తాజాగా 2025 సెప్టెంబర్ 10 నుంచి ఆయన టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. అంతకుముందు కూడా చంద్రబాబు హయాంలోనే 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా సింఘాల్ సేవలందించారు.

అయితే, తిరుమల లడ్డూ నెయ్యి వివాదం నేపథ్యంలోనే ఈ బదిలీ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలను కుదిపేసిన లడ్డూ వివాదంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సింఘాల్‌ను బదిలీ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అసలు బాధ్యత వహించాల్సిన వారిని వదిలేసి, టీటీడీ ఈవోపై నెపం మోపుతూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

సింఘాల్‌ను రెండు సార్లు ఈవోగా నియమించిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు అదే సింఘాల్‌ను నెయ్యి వ్యవహారానికి బాధ్యుడిగా చేస్తూ బదిలీ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు ఈవో బదిలీ ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి, తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతూ, చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై మరిన్ని సందేహాలకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment