బీఆర్ నాయుడే ఒప్పుకున్నాడు.. కేసులు పెట్టండి – భూమన

బీఆర్ నాయుడే ఒప్పుకున్నాడు.. కేసులు పెట్టండి - భూమన

టీటీడీ (TTD) గోశాల (Cow Shelter) వ్యవహారంపై వివాదం మళ్లీ రగిలింది. గ‌త ఏప్రిల్‌లో గోశాల గురించి వ్యాఖ్య‌లు చేసిన టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy)పై ఇటీవ‌ల టీటీడీ కేసు(Case) న‌మోదు చేయించింది. తాజాగా నిన్న జ‌రిగిన బోర్డు స‌మావేశంలో గోశాల నిర్వహ‌ణ స‌రిగ్గాలేద‌ని స్వ‌యంగా అంగీక‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

గోశాల గురించి టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడే (B.R.Naidu) వాస్త‌వాల‌ను ఒప్పుకున్నాడ‌ని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమ‌ల తిరుప‌తి పాల‌క‌మండ‌లి స‌మావేశంలో బీఆర్ నాయుడు స్వయంగా గోశాల సమస్యలను అంగీకరించి, దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారని భూమన చెప్పారు. నిపుణుల కమిటీని వేసి నిర్వహ‌ణ‌ను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందని, వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్వ‌యంగా టీటీడీ చైర్మ‌నే అన్నార‌ని గుర్తుచేశారు.

తాను కూడా గోశాల నిర్వాహ‌ణ స‌రిగ్గా లేద‌ని, అందువ‌ల్లే గోవులు మ‌ర‌ణిస్తున్నాయ‌న్న విష‌యాన్ని ఏప్రిల్ నెలలో తాను చెప్పానని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చెప్పారు. ఈ మాట చెప్పినందుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని త‌నపై ఉసిగొల్పి, త‌న మీద మత విద్వేషాలను, హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నాన‌ని కేసు పెట్టించార‌న్నారు. గోశాల నిర్వహ‌ణ‌పై వాస్త‌వాన్ని అంగీక‌రించిన త‌న‌పై పెట్టిన సెక్ష‌న్ల కిందనే కేసు రిజిస్ట‌ర్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

దాదాపు 70 ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలను బీఆర్ నాయుడు చైర్మ‌న్ అయిన తర్వాత నిర్వీర్యం అయిపోయిందని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాల‌నే ఆలోచ‌న తప్పు అని ఖండించారు. బీఆర్ నాయుడు ఆధ్వ‌ర్యంలో వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేదు, గోశాలను సరిగ్గా నిర్వహించలేదంటూ మండిప‌డ్డారు. బీఆర్ నాయుడు ఉసిగొల్పి పెట్టించే త‌ప్పుడు కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని, మాజీ చైర్మ‌న్‌గా, వెంక‌న్న భ‌క్తుడిగా అన్యాయాల‌ను ఎత్తి చూపించే బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment