చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటి?

“చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం?” – ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత అక్షరాలా సరిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమా టికెట్ ధరల విషయంలో చేసిన సూచనలను పెడచెవిన పెట్టిన వారు, నేడు థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమయ్యాక గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా మారింది.

నాటి జగన్ సూచన.. నేటి కఠిన వాస్తవం
సినిమా టికెట్ ధర సామాన్యుడికి అందుబాటులో ఉంటేనే థియేటర్లు బతుకుతాయని, సినిమా రంగం మనుగడ సాగిస్తుందని గతంలో జగన్ స్పష్టంగా చెప్పారు. పరిశ్రమలోని పెద్దలను తన ఇంటికి పిలిచి మరీ, చిన్న సినిమా – పెద్ద సినిమా అనే తేడా లేకుండా అందరూ బాగుండాలని చెప్పారు. కానీ, అప్పట్లో కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు దీనిని ‘ప్రభుత్వ జులుం’గా చిత్రీకరించారు. సినిమా రంగంపై ప్ర‌భుత్వ పెత్త‌నం ఏంటీ..? అని ఓ వ‌ర్గం వాద‌న‌ను భుజానికి ఎత్తుకొని నానా రకాలుగా మాట‌లు జారారు. నేడు అదే సినీ పెద్దలు జగన్ చెప్పిందే నిజమని లోలోపల మధనపడుతుండ‌డం విశేషం.

బడ్జెట్ మాయాజాలం.. అభిమానులపై భారం
సినిమా బడ్జెట్‌ను ఇష్టానుసారంగా పెంచేసి, ఆ పెట్టుబడిని రాబట్టుకోవడానికి బెనిఫిట్ షోలు, భారీ టికెట్ ధరల పెంపుతో అభిమానుల జేబులకు చిల్లు పెట్టారు. దీనివల్ల సామాన్య ప్రేక్షకుడు థియేటర్ వైపు రావడమే మానేశాడు. ప్రస్తుతం వందల కోట్ల కలెక్షన్లు వస్తున్నాయని చెబుతున్నా, అవి ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కావు, కేవలం పెరిగిన ధరల వల్ల వచ్చిన ‘అంకెలు’ మాత్రమేనని ఇండస్ట్రీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.

ముదురుతున్న యుద్ధం
ప్రస్తుతం థియేటర్ యజమానులకు, నిర్మాతలకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. “మేము పెంచే టికెట్ ధరల వల్ల కాదు, థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు విపరీతంగా ఉండటం వల్లే జనం రావడం లేదు” అని ఒక యువ నిర్మాత కౌంటర్ ఇచ్చారు. మరోవైపు, ఇకపై సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు పెంచబోమని, ప్రభుత్వం నుంచి జీవో వచ్చినా పెంచే ప్రసక్తి లేదని థియేటర్ యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. సినిమా రంగం బ‌త‌కాలంటే టికెట్ల ధ‌ర నియంత్ర‌ణ‌లో ఉండాల‌ని, ఒక కుటుంబం వినోదం కోసం థియేట‌ర్‌కు వెళితే దాన్ని ఆర్థిక భారంగా భావించ‌కుండా ఉండే ప‌రిస్థితులు తీసుకురాగ‌లిగితేనే.. థియేట‌ర్ రంగం మ‌నుగ‌డ సాగిస్తుందంటున్నారు.

బన్నీ వాసు ట్వీట్.. అసలు సమస్య ఎక్కడ?
ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఆదాయం పడిపోవడానికి ఆయన నాలుగు ప్రధాన కారణాలను విశ్లేషించారు హీరోలు ఒక్కో సినిమాకు రెండేళ్లు సమయం తీసుకోవడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతోంది. సినిమా విడుదలైన 27 రోజుల్లోనే OTTలోకి వచ్చేస్తుండటం వల్ల థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. భారీ ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లే స్థాయి కంటెంట్ లేకపోవడం. మల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో విపరీతమైన ధరల వ‌ల్లే ప్రేక్ష‌కుడు సినిమాకు దూరం అవుతున్నాడ‌ని నిర్మాత బ‌న్నీ వాసు అభిప్రాయం.

వినోదం అనేది సామాన్యుడికి భారం కాకూడదన్న జగన్ మాటలను నాడు రాజకీయం చేసి విమర్శించిన వారు, ఇప్పుడు థియేటర్లు ఖాళీ అవుతుంటే ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ప్ర‌ధాన‌ సమస్యను వదిలేసి, పడిపోయిన ఆదాయంలో వాటాల కోసం కొట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment