తిరువూరు (Thiruvuru)లో రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)కు అత్యంత సన్నిహితుడు అయిన టీడీపీ(TDP) ఎంపీ కేశినేని చిన్ని (Keshineni Chinni) ఆ పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్(TDP Ticket) కోసం ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తన వద్ద నుంచి రూ. 5 కోట్లు డిమాండ్(Demand) చేశారంటూ ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌తో సహా
తాను తన అకౌంట్ నుంచి మూడుసార్లు రూ.60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశానని, ఎంపీ చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి తన వద్ద నుంచి మరో రూ.50 లక్షలు తీసుకెళ్లారని బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఆధారాలతో సహా ఎమ్మెల్యే కొలికపూడి ఫేస్‌బుక్‌లో సంచలన పోస్ట్ పెట్టారు. మిగిలిన డబ్బు “తిరువూరులోని నా మిత్రులు ఇచ్చిన రూ.3.50 కోట్ల విషయం రేపు చెబుతా” అంటూ కూడా ఆయన పోస్టు చేశారు.
టీడీపీలో ప్రకంపనలు..
ఈ పోస్టు టీడీపీ శ్రేణుల్లో ప్రకంపనలు రేపింది. సొంత పార్టీ ఎంపీపై డబ్బు డిమాండ్ ఆరోపణలు రావడంతో తిరువూరు రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. వీరిద్దరి వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. సోషల్ మీడియాలో కొలికపూడి పోస్టులు వైరల్ అవుతుండగా, పార్టీలో అంతర్గత విభేదాలు బహిరంగమయ్యాయి. “నిజమే గెలవాలి“ అంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.
కేశినేని రియాక్షన్..
ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. “నేను ఎప్పుడు నా జేబులో డబ్బులు మాత్రమే ఖర్చు పెడతాననని, నేనేంటో విజయవాడ పార్లమెంట్ ప్రజలకు తెలుసు. కేవలం ఐదు, పది లక్షల రూపాయల కోసం నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ లేకపోతే నేను లేనని చెప్పిన ఎమ్మెల్యే.. ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ఆయనే సమాధానం చెప్పాలి. 12 నెలలు దేవుడిగా ఉన్న నేను ఇప్పుడు దెయ్యంగా మారానంటే, ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలి“ అంటూ వ్యాఖ్యానించారు.








