తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భూమన మాట్లాడుతూ.. “గతంలో తిరుమలలో నీటి ఎద్దడి వల్ల శ్రీవారి ఆలయాన్ని మూడు నెలల పాటు మూసివేయాలని చెప్పిన అధికారి ఎవరు? ఏ అధికారం ఉంది ఆయనకు అలా చెప్పడానికి? 90 రోజుల్లో నీటి ఎద్దడి పరిష్కరించకపోతే అరెస్టు చేస్తామని మీరు ఏ అధికారం ప్రకారం హెచ్చరించారు?” అని చంద్రబాబును ప్రశ్నించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోల్చడం ఏమిటని ప్రశ్నించారు.
గణపతి ఆలయంపై పవన్ సమాధానం చెప్పాలి
చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే హిందూ దేవాలయాలను వాడుకుంటారని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేసినప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని భూమన ప్రశ్నించారు. “ఇప్పుడు పవన్ సమాధానం చెప్పాలి” అంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఆ ఘనత వైఎస్సార్‌ది.. బాబుది కాదు
తిరుమలలో ఓబెరాయ్ సంస్థకు హోటల్, దేవలోక్ నిర్మాణాలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికే కాదు, కొండపైకి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదాన్ని అందించాలనే నిర్ణయం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో జరిగిందని భూమన గుర్తుచేశారు. అలాగే హిందువులు మాత్రమే స్వామివారి దేవస్థానంలో పనిచేయాలనే నిర్ణయం కూడా వైఎస్సార్ హయాంలోనే జరిగిందన్నారు. తానే అన్నప్రసాద విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు, హిందువేతరులకు స్థానం ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడాన్ని భూమన ఖండించారు.
ఏడాది నిబంధనకు బాబుకు వర్తించదా..?
ఈఓ ధర్మారెడ్డిపై పెద్ద ఎత్తున ఆక్షేపణలు చేసిన చంద్రబాబు.. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు చనిపోయి రెండు నెలలు కాకముందే శ్రీవారి ఆలయానికి ఎలా వస్తారు..? ఏడాది పాటు ఆలయానికి వెళ్ళకూడదనే నిబంధనలు చంద్రబాబుకు వర్తించవా? అని ప్రశ్నించారు. సామాన్య భక్తులకు మధ్యాహ్నం దాటితే మాత్రమే దర్శనం అవకాశముంటుందని, కానీ వీఐపీల కోసం సీఎంవో కార్యాలయం నుంచే ప్రత్యేక దర్శనాలు కేటాయించబడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని భూమన అన్నారు.