తిరుమల లడ్డూ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడెక్కింది. అసెంబ్లీలో లడ్డూపై లఘు చర్చను చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైసీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సభలో చేసిన ప్రతి ప్రధాన ఆరోపణకు ఆధారాలతో సమాధానాలు ఇస్తూ వైసీపీ ట్వీట్ థ్రెడ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసెంబ్లీలో లఘు చర్చ.. మండలిలో తిరస్కరణ
శాసన మండలిలో నాలుగు రోజుల పాటు వాయిదా తీర్మానాలు ఇచ్చిన వైసీపీ, హెరిటేజ్–ఇందాపూర్ మధ్య నెయ్యి సరఫరా అంశాన్ని సభలో చర్చించాలని డిమాండ్ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వరుసగా ఆ తీర్మానాలను తిరస్కరించింది. తాజాగా తమకు అధిక బలం ఉన్న అసెంబ్లీలో లడ్డూ అంశంపై లఘు చర్చ పెట్టిన ప్రభుత్వం, ఈ చర్చను ఏకపక్షంగా నడిపించిందని వైసీపీ ఆరోపిస్తోంది.
లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమితమైన సీబీఐ సిట్ ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని స్పష్టం చేసిన విషయాన్ని వైసీపీ గుర్తుచేసింది. అయినప్పటికీ అధికార పార్టీ అదే ఆరోపణలను పునరావృతం చేస్తోందని విమర్శించింది. హెరిటేజ్ మరియు ఇందాపూర్ మధ్య నెయ్యి సరఫరా సంబంధాలపై ఆధారాలు బయటపడ్డాయని, వాటిని సభలో చర్చించకుండా తప్పించుకుంటున్నారని వైసీపీ పేర్కొంది. ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.
ఆ రెండు జీవోలు విడుదల చేసినా.. ఆగని దుష్ప్రచారం
తిరుమల లడ్డూ వివాదంలో మరోసారి జీవో 338 ప్రస్తావనకు వచ్చింది. వైయస్‌ఆర్ రెండు కొండలు అన్నారంటూ మొదట ప్రచారం జరిగిందని, దీనికి ప్రతిగా వైఎస్ జగన్ రెండు జీవోలు విడుదల చేసి ఏడు కొండల పరిరక్షణపై స్పష్టత ఇచ్చారని వైసీపీ తెలిపింది. ఇప్పుడు జీవో 338 పేరుతో మళ్లీ పాత నాటకం తెరపైకి తెచ్చారని ఆరోపించింది. అసలు జీవో 338 తిరుమలలో ఎన్నికలు, రాజకీయాలకు స్థానం లేదని తెలియజేసేదని వైసీపీ స్పష్టం చేసింది. “మీరు అబద్ధం చెప్పొచ్చు.. కానీ జీవోలు అబద్ధం చెప్పవుగా చంద్రబాబు?” అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.
సోషల్ మీడియాలో వైరల్
అసెంబ్లీలో అధికార పార్టీ చేసిన ప్రతి వ్యాఖ్యకు వెంటనే స్పందిస్తూ ఆధారాలతో ట్వీట్లు చేయడం వైసీపీ వ్యూహంగా మారింది. ఈ ట్వీట్ థ్రెడ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. మొత్తానికి తిరుమల లడ్డూ అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. సభలో ఒకవైపు ఆరోపణలు కొనసాగుతుండగా, ఎక్స్ వేదికగా వైసీపీ ఆధారాలతో కౌంటర్ ఇస్తూ రాజకీయ పోరును మరింత ఉధృతం చేసింది.
.@ncbn రెడీగా ఉండు.. నీ అబద్ధపు మాటలకు ఇక కాలం చెల్లింది.🚨#SaveTirumalaFromTDP#YSRCPFactCheck#SadistChandraBabu#TirupatiLaddu pic.twitter.com/F6gJExV4BZ
— YSR Congress Party (@YSRCParty) February 24, 2026








