కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని తేలిపోయింది. ఇన్నాళ్లూ కూటమి పెద్దలు చేసిందంతా తప్పుడు ప్రచారమని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది. అయినా, ఫ్లెక్సీలతో దేవదేవుడిని మళ్లీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై ప్రతిపక్ష వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తిరుమలేశునిపై జరుగుతున్న రాజకీయ దాడిని ఖండిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ శ్రీవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని వైసీపీ మండిపడుతోంది. ఈ అంశంపై సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ దర్యాప్తు జరిపి, లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా తేల్చిందని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.
సీబీఐ నివేదిక వెలువడిన తర్వాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోవడాన్ని వైసీపీ తప్పుబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఫ్లెక్సీలు, పోస్టర్ల రూపంలో మరోసారి అపనిందలు మోపే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. దేవుడి ప్రసాదంపై మరలా నిందలు వేస్తారా అంటూ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. పాపం మీద పాపం చేస్తూ తిరుమల పవిత్రతకు కళంకం తెచ్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు బ్యాచ్ చేసిన మహాపచారానికి పరిహారంగా, అలాగే తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతోనే పాప ప్రక్షాళన పూజలు చేపట్టామని వైసీపీ స్పష్టం చేసింది. వెంకటేశ్వర స్వామి కృపతో సత్యం గెలవాలని, భక్తుల మనోభావాలకు న్యాయం జరగాలని ఈ ప్రత్యేక పూజల ద్వారా ప్రార్థిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పాప ప్రక్షాళన పూజలు రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక అంశంగా మారాయి.








