గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఒక దారుణ ఘటనలో ముగ్గురు యువకులు జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్‌పై పోలీసు అధికారులు అమానుషంగా దాడి చేశారు. నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు యువకులను కూర్చోబెట్టి, అరికాళ్లపై లాఠీలతో బలమంతా ఉపయోగించి దాడి చేశారు. ఒక సీఐ యువకుల కాళ్లను తన కాలితో అదిమి పెట్టగా, మరొక అధికారి వారిని కొట్టినట్లు సమాచారం. ఈ దాడిని మిగతా పోలీసులు చిత్రీకరించడమే కాక, లాఠీలు విరిగినప్పుడు కొత్త లాఠీలను అందించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దుశ్చర్యను పౌరులంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. మనవహక్కుల సంఘం ఈ దుర్ఘటనపై స్పందించాలని కోరుతున్నారు.
తెనాలిలో పోలీసుల దాడి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనను రాజ్యాంగ విలువలపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు.
‘రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘిస్తోంది. పోలీసులు చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో చట్ట బద్దమైన పాలన సాగటం లేదు. యధేచ్చగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో సహా ప్రతి పౌరుడి హక్కులను కాలరాస్తున్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులైన జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్‌లను పోలీసు అధికారులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. నడిరోడ్డుపై కూర్చోపెట్టి పట్టపగలే అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. ఒక సీఐ వారి కాళ్లను తన కాలితో అదిమి పెట్టగా, మరొక అధికారి వారిని కొట్టారు. మిగతా పోలీసులు పక్కనే ఉండి ఆ దారుణాన్ని చిత్రీకరించారు. పైగా లాఠీలు విరిగితే కొత్తవి అందించారు.
నెల క్రితం ఈ సంఘటన జరిగినా ఈ విషయంపై మాట్లాడటానికి కూడా జనం భయ పడ్డారు. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ మరోసారి తెలిసింది. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం రాష్ట్రంలో జరిగాయి. ఏపీలో ఒక భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులనే అపహాస్యం చేస్తున్నారు. ఈ సంఘటన మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించటమే. ఇది రాజ్యాంగ విలువలపై ప్రత్యక్షంగా జరిగిన దాడి. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్లాలి. అంతేగానీ ఇలా బహిరంగంగా దాడి చేయటానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు. జరిగిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
తెనాలి ఘటనను జగన్, “రెడ్‌బుక్ రాజ్యాంగం” అమలు ద్వారా రాష్ట్రంలో అణచివేత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. తెనాలిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో చట్టం-వ్యవస్థ, ప్రజాస్వామ్య హక్కులపై మరింత చర్చను రేకెత్తించాయి. వైఎస్ జగన్ ఈ ఘటనను రాజ్యాంగ ఉల్లంఘనగా, మానవ హక్కుల దుర్వినియోగంగా హైలైట్ చేస్తూ, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సంఘటనపై అధికారిక విచారణ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
The @ncbn-led government in Andhra Pradesh is openly violating the Indian Constitution by allowing police to exercise unchecked power. Rather than upholding the rule of law, the state is being run under a harsh “Red Book Constitution” that disregards the rights and protections… pic.twitter.com/zqvwxWXolJ
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2025







