తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 మున్సిపల్ వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
ప్రస్తుతం లభ్యమైన సమాచారం ప్రకారం, అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 12 వార్డులు ఏకగ్రీవంగా దక్కాయి. భారత్ రాష్ట్ర సమితి (BRS) రెండు వార్డుల్లో ఏకగ్రీవ విజయాన్ని సాధించింది. ఈ ఫలితాలు స్థానిక స్థాయిలో కాంగ్రెస్ బలం గురించి చర్చ జరుగుతుండగా, అధికార పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టి, ప్రలోభపెట్టి నామినేషన్లు విత్ డ్రా చేపించడంతోనే ఇది జరిగిందని, అది సొంత బలం కాదని అంటున్నారు.
జిల్లాల వారీగా చూస్తే సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా ఏకగ్రీవ ఫలితాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కోడాడ మున్సిపాలిటీలో మూడు వార్డులు ఏకగ్రీవంగా తేలడం గమనార్హం. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు వార్డుల్లో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి. తమ క్యాండిడేట్‌లను కాంగ్రెస్ పార్టీ భయపెట్టి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసిందని స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్, BRS పార్టీలకు చెరో ఒక్క వార్డు చొప్పున ఏకగ్రీవ విజయం దక్కింది. మరోవైపు మహబూబ్‌నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించారు, ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావాన్ని సూచిస్తోంది. ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం మహిళా అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఏకగ్రీవ విజయాలు లభించడం.








