చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన తాజా సంఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం పెద్దబదనవాడ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు ఇసుప రాడ్లు, గడ్డపారలతో ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో సచివాలయ శాశ్వత భవనం నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు ఉండటాన్ని జీర్ణించుకోలేకే టీడీపీ కార్యకర్తలు ఈ దాష్టీకానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తుండగా చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని వైసీపీ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఘటనపై అధికార తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.