ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనే కాదు, బ్యూరోక్రసీ (Bureaucracy)లో కూడా పెను దుమారం రేపేలా టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి (Gunapati Deepak Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఐఏఎస్ అధికారుల పనితీరుపై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వ యంత్రాంగాన్నే ప్రశ్నార్థకంగా నిలబెడుతున్నాయి.
సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ (SEEDAP) చైర్మన్‌గా ఉన్న దీపక్ రెడ్డి, ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. గత 14 నెలలుగా తనకు జీతం ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఫైనాన్స్ సెక్రటరీకి (Finance Secretary) ఎన్నిసార్లు చెప్పినా ఒక్క ఫైల్ కూడా క్లియర్ కాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు పనులు ఆలస్యం చేయడం వెనుక స్వలాభం, అవినీతి కోణమే ఉందని ఆరోపించారు.
‘డ్రామాలు, నీతులు.. కానీ కోట్ల ఇళ్లు ఎలా?’
కలెక్టర్లు (Collectors) నీతులు మాట్లాడుతూ డ్రామాలు చేస్తున్నారని, అసలు వారికి ఏ రోగం పట్టిందో అర్థం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులకు వచ్చే జీతం ఎంత అనేది పక్కన పెడితే, ఆ జీతంతోనే 8 నుంచి 10 బెడ్‌రూమ్‌ల ఇళ్లు ఎలా కడుతున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇంకా సంచలనంగా, ఐఏఎస్ అధికారులు మరియు కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు సమాచారమే 2019లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), 2024లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యిందని వ్యాఖ్యానించారు.
బ్యూరోక్రసీలో కలకలం
“దొంగలు IAS వ్యవస్థలోనూ ఉన్నారు. దొంగలు, దరిద్రం చుట్టుకున్నట్టు చుట్టుకున్నారు. ఏమీ రోగం.. నీతులు మాట్లాడుతారు.. డ్రామాలు ఆడుతారు. నా మీద తిరుగుబాటు చేస్తే వాళ్ల చరిత్ర తీస్తా.. దొంగలు ఐఏఎస్ వ్యవస్థలో ఉన్నారు” అనే ఘాటు వ్యాఖ్యలు ఆ ఇంటర్వ్యూలో చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ బ్యూరోక్రసీలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధి స్థాయి నుంచి ఇంత బహిరంగంగా అధికారులపై విమర్శలు రావడం రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలక మలుపుగా మారుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.








