తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకుగాన 950 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఐదేళ్లకు ఒకసారి అధికారాన్నీ మార్చేసే తీర్పునిచ్చే తమిళ తంబీలు ఈ సారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ఉత్కంఠ నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో ఏ పార్టీ బలం ఎంత.. ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారో తెలుసుకుందాం..
తమిళనాడు రాజకీయాలు ఈసారి హాట్ టాపిక్‌గా మారాయి. అధికార డీఎంకే పార్టీ 14 పార్టీలతో కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతూ 164 స్థానాల్లో స్వయంగా పోటీ చేస్తోంది. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో స్టాలిన్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకున్నప్పటికీ అవినీతి ఆరోపణలు, సామాజిక సమస్యలు కొంత నెగిటివ్‌గా మారాయి. మరోవైపు అన్నాడీఎంకే, జయలలిత మరణం తర్వాత బలహీనపడినా ఇంకా గ్రౌండ్ లెవల్‌లో బలమైన క్యాడర్‌తో పోటీకి సిద్ధమైంది. పళనిస్వామి నాయకత్వంలో పార్టీ క్రమంగా పుంజుకుంటున్నా, మాస్ అప్పీల్ లో కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది.
ఇక సినీ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. TVK పార్టీకి యువత, మహిళలు, కొంత మైనారిటీ వర్గాల మద్దతు ఉండటం పెద్ద ప్లస్. కానీ గ్రామ స్థాయిలో బలహీనమైన క్యాడర్, అనుభవలేమి సవాళ్లుగా మారాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, డీఎంకే వ్యతిరేక ఓట్లు విడిపోయే అవకాశం ఉండటం అధికార పార్టీకి కలిసొచ్చే అంశం. అదే సమయంలో అన్నాడీఎంకేకు ఇది పెద్ద నష్టంగా మారొచ్చు. భారీ సభలు, ప్రజాదరణ ఉన్నా అవి ఓట్లుగా మారుతాయా లేదా అన్నది కీలకం. మొత్తం మీద ఈ త్రిముఖ పోటీ ఫలితం చివరి వరకు ఉత్కంఠగా ఉండగా, తమిళ ఓటరు తీర్పు ఎలా ఉంటుందో అన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.









సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’