దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై భారత అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
ప్రస్తుత దశలో విచారణను మరొక రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం గానీ, తగిన బలమైన కారణాలు గానీ ఏమాత్రం కనిపించడం లేదని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీల ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే సుప్రీంకోర్టు ఎదుట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుసగా ఈ అంశంపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు అనుకూలమైన వాతావరణం లేదని, విచారణ వేగంగా, పారదర్శకంగా జరగాలంటే కేసును ఏపీ నుంచి పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు.
న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలపై స్పందించిన జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ.. “గతంలో సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా వారు రాజకీయ వ్యాఖ్యలు చేశారా?” అని ప్రశ్నించారు.
ప్రస్తుత దశలో కేసును ఏపీ బయటకు మార్చాలన్న వినతిని తోసిపుచ్చిన సీజేఐ బెంచ్, పిటిషన్ను పూర్తిగా కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణ యథాతథంగా కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తిరుపతి లడ్డూ వివాదంపై రాజకీయ లాబీయింగ్ చేస్తున్న వర్గాలకు గట్టి షాక్ కాగా, సిబిఐ నిష్పక్షపాత విచారణపై సుప్రీంకోర్టు తన పూర్తి విశ్వాసాన్ని మరోసారి పునరుద్ఘాటించింది.








