విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్‌కు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. అయితే, ఈ గెజిట్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేశారు కానీ, అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ ను రాయగడ డివిజన్‌కు (Rayagada Division) మళ్లించడం ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునపడేసింది.
జోన్‌కు భారీ ఆదాయ గండి?
ఈ జోన్ ఏర్పాటులో అత్యంత వివాదాస్పద అంశం కోత్తవలస – కిరండూల్ (KK) లైన్ కేటాయింపు. ఈ లైన్ భారత రైల్వేలోనే అత్యధికంగా ఇనుప ఖనిజం రవాణా చేస్తూ, భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. గెజిట్ ప్రకారం, అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్‌ను విశాఖపట్నం నుంచి తప్పించి, ఒడిశా పరిధిలోకి వెళ్లేలా కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్‌కు కేటాయించారు.
విశాఖ జోన్ వస్తే కేకే లైన్ ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి దక్కుతుందని ఆశించిన ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. ఆదాయం వచ్చే ప్రాంతాలను పక్క జోన్లకు (ECoR) వదిలేసి, ఖర్చుతో కూడిన ప్రయాణికుల విభాగాన్ని మాత్రమే ఏపీకి పరిమితం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేకే లైన్‌ను విశాఖ జోన్‌లోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్రంలోని అధికార కూటమి (TDP-JSP-BJP) నేతలు పూర్తిగా విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకుంటున్న కూటమి నేతలు, అత్యధిక ఆదాయం వచ్చే లైన్‌ను వేరే రాష్ట్రానికి వదిలేయడం వారి అసమర్థతకు నిదర్శనం. రాజీపడటం వల్లే విశాఖ జోన్ ఇప్పుడు ‘ఆదాయం లేని జోన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది” అని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, గెజిట్‌లో మార్పులు చేయాలని, కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే ఉంచాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








