సోషల్ మీడియా (Social Media) కారణంగా చిన్నపిల్లలలో పెరుగుతున్న వ్యసనం, మానసిక ఒత్తిడి, చదువుపై దుష్ప్రభావాల నేపథ్యంలో.. భారత్ (India)లో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు (Children Below 16 years) సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood) అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలు మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్‌ను పరిమితం చేస్తుండటంతో.. మన దేశం కూడా ఇదే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సోనూసూద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు తమ నిజమైన బాల్యాన్ని ఆస్వాదించాలంటే, కుటుంబ బంధాలు మరింత బలపడాలంటే సోషల్ మీడియా వ్యసనాన్ని తగ్గించడం అత్యంత కీలకమని తెలిపారు. డిజిటల్ మీడియా కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా, భారత ప్రభుత్వం దేశ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. భవిష్యత్తు తరాలను రక్షించాలంటే, పిల్లల డిజిటల్ యాక్సెస్‌పై కఠిన నియంత్రణలు తప్పనిసరి అవుతాయని సోనూసూద్ పేర్కొన్నారు. పలు దేశాలు మైనర్లకు సోషల్ మీడియాపై నియంత్రణలు అమలు చేస్తున్న వేళ.. భారత్‌లో కూడా ఈ చర్యల అవసరం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.








