శింగనమలలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ జెడ్పీటీసీపై హ‌త్యాయ‌త్నం!

శింగనమలలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ జెడ్పీటీసీపై హ‌త్యాయ‌త్నం!

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యల్లనూరు వైసీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ దాడిలో జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఆయనతో పాటు మరో నలుగురు వైసీపీ కార్యకర్తలకు కూడా తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గాయాలతోనే యల్లనూరు పోలీస్ స్టేషన్ ఎదుట జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన చేపట్టారు.

టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగగా, ఆ ధర్నా సమయంలోనూ టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచక పాలన కొనసాగుతోందని, వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని వారు మండిపడ్డారు.

ఈ ఘటనపై వెంటనే కేసులు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. యల్లనూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment