పశ్చిమ ఆఫ్రికా (West Africa) దేశం సెనెగల్ (Senegal) తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ (Boat) అట్లాంటిక్ సముద్రంలో (Atlantic Ocean) బోల్తాపడింది. ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 34కు చేరింది. ఒకరిని మాత్రమే రక్షించగలిగారు. ఇంకా ఎంతమంది గల్లంతయ్యారనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. రాజధాని డాకర్(Dakar), ఉత్తర ప్రాంతంలోని సెయింట్ లూయిస్ (Saint-Louis) నగరాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని కానరీ దీవులకు వెళ్తున్న చిన్న చెక్క పడవ ఒక్కసారిగా మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది.
వెలికితీసిన మృతదేహాలన్నీ సెనెగల్ దేశస్థులవేనని వలసదారులకు సహాయం అందించే బోజా ఫీ సంస్థ వ్యవస్థాపకుడు సాలియో డియూఫ్ వెల్లడించారు. పడవలో ప్రయాణించిన మిగతావారి జాతీయతలు ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సెనెగల్ అధ్యక్షుడు బస్సిరౌ డియోమాయే ఫాయే (Bassirou Diomaye Faye) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలకు దూరంగా ఉండాలని యువతకు (Youth) సూచించారు. అక్రమ వలసలకు పాల్పడే ముఠాలపై చర్యలను మరింత కఠినతరం చేస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, స్పెయిన్‌కు (Spain) వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న 142 మంది వలసదారులతో కూడిన మరో పడవను శుక్రవారం సెనెగల్ అధికారులు అడ్డుకున్నారు. వీరిలో 23 మంది మహిళలు, ఇద్దరు శిశువులు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు వలసదారుల రాక పెరగడంతో స్పెయిన్‌లోని ఎల్ హియెర్రో(El Hierro) దీవిలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. నవంబర్ ప్రారంభం నుంచి సుమారు 30 పడవల్లో 3,300 మందికి పైగా వలసదారులు అక్కడికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ దీవుల మీదుగా యూరప్‌కు (Europe) చేరుకునే మార్గం ప్రస్తుతం వలసదారులకు ప్రధాన మార్గంగా మారింది.
ఉపాధి అవకాశాల కొరత, కుటుంబ ఒత్తిళ్లు, విదేశాల్లో మెరుగైన జీవితం పొందాలనే ఆశ వలసలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) కూడా ఈ అంశాలను ప్రస్తావించింది. సెనెగల్ గణాంకాల ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో ప్రతి నలుగురు యువతలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం అధ్యక్షుడు ఫాయే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అక్రమ వలసలను అరికట్టడంతో పాటు మానవ అక్రమ రవాణా ముఠాలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉపాధి అవకాశాలు లేక యువత ప్రమాదకర సముద్ర ప్రయాణాలకు సిద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.








