వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచల సవీంద్రారెడ్డి (Kunchala Savindra Reddy) అక్రమ నిర్బంధం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ(CBI) విచారణ నిలిపేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసులు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఈనెల 13వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.
ప్రత్తిపాడు (Prathipadu) సీఐ (CI) శ్రీనివాసరావు (Srinivas Rao), లాలాపేట (Lalapet) సీఐ (CI) శివప్రసాద్ (Shivaprasad) హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణను పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైకోర్టుకు సమర్పించేందుకు సీబీఐ నివేదిక సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
సవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంలో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయని సీబీఐ ప్రాథమిక నివేదిక రూపొందించినట్లుగా సమాచారం. విచారణకు సహకరించలేదని సీబీఐ నోటీసుల్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముప్పును తప్పించుకునేందుకు పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం. ఇదే సమయంలో సవీంద్రారెడ్డి న్యాయవాది ముందుగానే కేవియట్ కూడా దాఖలు చేశారు. రేపు ఈ పిటిషన్‌పై విచారణ జరగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.







