హీరోయిన్‌గా ఒకప్పుడు స్టార్‌డమ్ చూసిన సమంత (Samantha)కు ప్రస్తుతం చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. ఇటీవల ‘శుభం’ (Shubham) సినిమాతో నిర్మాతగా మారిన సమంతకు ఆ సినిమా కంటెంట్ పరంగా పర్వాలేదనిపించినా, పెట్టుబడి వెనక్కి వచ్చిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. నిర్మాతగా తొలి అడుగు ఫర్వాలేదనిపించుకున్నా, నటిగా మాత్రం ఆమెకు కష్టకాలం (Difficult Time) నడుస్తోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆరోగ్య సమస్యలు, కెరీర్‌పై ప్రభావం:
నాగచైతన్యతో విడాకుల తర్వాత, సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదనిపించుకోగా, ఆ తర్వాత నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెబ్ సిరీస్ కూడా సమంతకు పెద్దగా కలిసొచ్చింది లేదు. ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ కూడా మొత్తానికే ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘రక్త్ బ్రహ్మాండ్’ నిలిపివేతకు కారణాలు:
కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, కేవలం 25 రోజులే షూటింగ్ జరిగినప్పటికీ, సగానికి పైగా బడ్జెట్ ఖర్చయిపోయిందని ప్రచారం జరిగింది. ఇదంతా ఒక ఆడిట్ ద్వారా బయటపడటంతో, అకౌంటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి షూటింగ్‌ను నిలిపివేశారని టాక్ నడిచింది. ఇప్పుడు మిగిలిన బడ్జెట్ పెట్టి సిరీస్‌ను పూర్తి చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని, దీంతో సిరీస్ మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తోంది.
అయితే, ఈ సిరీస్ నిర్మాతలైన రాజ్-డీకే మాత్రం అలాంటిదేమీ లేదని తమ సన్నిహితుల వద్ద అంటున్నారట. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక ఆగిపోతే, సమంతకు ఇది నిజంగా కష్టకాలమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టులు ఏవీ లేవు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత దర్శకులు ఆమెకు హీరోయిన్ అవకాశాలు ఇస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది.